: ఆ వాహనానికి ఇంధనం గాలి!
ఆ వాహనానికి మనం పీల్చే గాలే ఇంధనం. అంతేకాదు, ఇంజన్, బ్యాటరీలు కూడా ఆ వాహనానికి అవసరం లేదు! కేవలం గాలితో నడిచే ఈ వాహనాన్ని విజయవాడకు చెందిన, ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్న డేవిడ్ రాజ్ అనే వ్యక్తి తయారుచేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకున్న పరిజ్ఞానంతో ఈ వాహనాన్ని తయారు చేశానన్నారు. వాయు పీడనం ద్వారా ట్యాంకుల్లోకి చేరే గాలి ఈ వాహనాన్ని నడుపుతుందన్నారు. ఈ వాహనం తయారీలో పాత విడిభాగాలు, ఎయిర్ కంప్రెషర్ పరికరాలు అమర్చానని, రెండు గాలి ట్యాంకులు, గేర్ బాక్స్, కంప్రెషర్ ను ఉపయోగించినట్టు ఆయన చెప్పారు. ఇరవై టన్నుల బరువు గల ఈ వాహనం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు. ఈ వాహనాన్ని తయారు చేసేందుకు సుమారు నలభై రోజుల పాటు శ్రమపడ్డానని, రూ.9 లక్షల వరకు ఖర్చు పెట్టానని అన్నారు. ప్రభుత్వం సహాయ సహకారాలందిస్తే ఈ వాహనానికి మరింత మెరుగులు దిద్దుతానని డేవిడ్ రాజు అన్నారు.