: పఠాన్ కోట్ లో పేలుడు కలకలం...ఉగ్రవాదులు ఇంకా ఉన్నారా?
పఠాన్ కోట్ ఆపరేషన్ లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని, అయితే, ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? అనే దానిపై గాలింపు చేపడుతున్నామని భద్రతా బలగాలు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఎయిర్ బేస్ లోపల పేలుడు సంభవించింది. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండగా పేలుడు శబ్దం వినిపించడంతో అంతా ఆందోళన చెందారు. దీంతో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో ఉగ్రవాదులు ఇంకా బతికే ఉన్నారా? ఉంటే, ఎంత మంది ఉన్నారు? అనే దానిపై మళ్లీ చర్చ జరుగుతోంది. అంతే కాకుండా, అసలు ఎయిర్ బేస్ సమాచారం వారికి అంత బాగా ఎలా తెలిసింది? ఎక్కడెక్కడ ఏమేం ఉన్నాయి? ఎక్కడ దాక్కుంటే సురక్షితం? ఎక్కడి నుంచి దాడులు చేయవచ్చు? వంటి విషయాలన్నీ వారికి ఎలా తెలిశాయి? అంటూ పెద్ద చర్చ జరుగుతోంది. మూడు రోజులపాటు ఉగ్రవాదులు దాక్కో గలిగారంటే వారికి ఎయిర్ బేస్ లోని ప్రతి అంగుళం గురించి తెలిసే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. తాజా పేలుడుతో ఉగ్రవాదులు ఇంకా ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.