: నేనిచ్చిన సమాచారంతోనే పెద్ద ముప్పు తప్పింది: పంజాబ్ పోలీసు అధికారి సల్వీందర్ సింగ్


ఉగ్రవాదులు చెరబట్టిన పంజాబ్ పోలీసు ఉన్నతాధికారి, మొన్నటిదాకా ఆ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లా గురుదాస్ పూర్ ఎస్పీగా పనిచేసిన సల్వీందర్ సింగ్ నేటి ఉదయం సంచలన ప్రకటన చేశారు. ఓ వైపు సల్వీందర్ సింగ్ వ్యవహార సరళిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు ఆయనతో పాటు ఆయన వెంట వెళ్లిన వంట మనిషి మదన్ గోపాల్ ను కూడా విచారించారు. విచారణ సందర్భంగా పొంతన లేని సమాధానాలు ఇచ్చిన సల్వీందర్ సింగ్ విచారణాధికారులకు చిర్రెత్తించారు. నేటి ఉదయం మీడియా ముందుకు వచ్చిన సల్వీందర్ సింగ్, తానిచ్చిన సమాచారం కారణంగానే పెద్ద ముప్పు తప్పిందని చెప్పారు. పఠాన్ కోట్ లోని ఓ గుడికి వెళ్లి వస్తున్న తనను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, ఆ తర్వాత వదిలేశారని సింగ్ చెప్పారు. ఆ తర్వాత సమీపంలోని గోల్ పూర్ సింబ్లీ గ్రామానికి చేరుకున్నానని ఆయన తెలిపారు. గ్రామస్తులకు తానెవరో చెప్పి, అక్కడి నుంచే తన పై అధికారులకు ఈ విషయంపై సమాచారం చేరవేశానని చెప్పారు. తానిచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ సహా, పలు కీలక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. దీంతోనే ఎయిర్ బేస్ లోకి చొచ్చుకువెళ్లినా, ఉగ్రవాదులు కీలక స్థావరాల దరికి చేరలేకపోయారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News