: పాక్ ప్రమేయంపై మూడు సాక్ష్యాలను వదిలి హతమైన ముష్కరులు!
పఠాన్ కోట్ ఉగ్రదాడి వెనుక పాక్ ప్రమేయం ఉందని మరింత గట్టిగా చెప్పడానికి సాక్ష్యాధారాలు లభించాయి. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు హతమైన తరువాత, ఎయిర్ బేస్ అణువణువూ గాలిస్తున్న పోలీసులకు మూడు కీలక ఆధారాలు లభించాయి. వీరందరూ ధరించిన షూస్ పాకిస్థాన్ లో లభించే ఓ ప్రముఖ బ్రాండ్ వేనని అధికారులు గుర్తించారు. ఇక టెర్రరిస్టులు తమ వద్ద ఉంచుకున్న బ్యాటరీలను స్వాధీనం చేసుకున్న సైన్యం అవి 'మేడిన్ పాకిస్థాన్' బ్యాటరీలని గుర్తించింది. ఇక వారు వాడిన ఏకే-47 రైఫిళ్లపైనా, 'మేడిన్ పాకిస్థాన్' అని స్పష్టమైన అక్షరాలు కనిపిస్తున్నాయి. ఈ ఆధారాలన్నీ పాక్ ప్రమేయాన్ని సూచించేవేనని విచారణ జరుపుతున్న అధికారులు వ్యాఖ్యానించారు. కాగా, ఈ దాడి తమ పనేనని పాక్ కేంద్రంగా నడుస్తున్న యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ ప్రకటించగా, ఇండియా మాత్రం ఈ దాడి జైషే మొహమ్మద్ దేనని వాదిస్తున్న సంగతి తెలిసిందే.