: సంచలనం... తలలు తెగ్గోస్తున్న కొత్త 'జీహాదీ జాన్' హిందువు!
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో సరికొత్త 'జీహాదీ జాన్'గా అవతరించి, బందీల పీకలను కూరగాయలు కోసినట్టుగా కోస్తున్న ఉగ్రవాది గురించిన కఠోర వాస్తవం ఒకటి వెలుగులోకి వస్తోంది. బ్రిటన్ కు చెందిన భారతీయుడు సిద్ధార్థ ధర్ కొత్త జీహాదీ జాన్ గా అవతరించాడని వార్తలు వస్తున్నాయి. బ్రిటన్ తరఫున గూఢచర్యం చేస్తూ, పట్టుబడ్డారన్న ఆరోపణలతో ఐదుగురి తలలను పదునైన కత్తులతో కోస్తున్న తాజా వీడియో ఒకటి విడుదల కాగా, అందులో ఉగ్రవాదులకు లీడర్ గా కనిపించినది సిద్ధార్థేనని బ్రిటన్ మీడియాలో వార్తలు వచ్చాయి. సిద్ధార్థ మతం మార్చుకుని అబూ రుమైసాహ్ గా పేరును మార్చుకున్నాడని, ఇప్పుడతను హై ప్రొఫైల్ ఉగ్రవాదని ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. కాగా, తాజాగా విడుదలైన వీడియోలో ఆరంజ్ రంగు దుస్తులను ధరించిన ఐదుగురు వ్యక్తులు వణికిపోతూ మోకాళ్లపై కూర్చోగా, ముఖానికి ముసుగు ధరించిన ఐదుగురు వెనుక నిలబడ్డారు. మధ్యలో ఉన్న వ్యక్తి (సిద్ధార్థ అని అంచనా) బ్రిటీష్ యాక్సెంట్ లో డేవిడ్ కామెరూన్ ను హతమారుస్తామని హెచ్చరించాడు. ఆపై అందరి గొంతులనూ కోసి చంపారు.