: భారత్ పై ఉగ్రదాడులు ప్రపంచానికి హెచ్చరికలాంటివి: యూఎస్ విదేశాంగ వ్యవహారాల కమిటీ సభ్యుడు


పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై, ఆఫ్ఘనిస్తాన్ లోని భారత దౌత్య కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడులపై అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్) సభ్యుడు, ఆ దేశ విదేశాంగ వ్యవహారాల కమిటీలోని సభ్యుడు బ్రాడ్ షెర్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను అంత తేలికగా తీసుకోడానికి వీల్లేదన్నారు. ప్రపంచానికి ఉగ్రవాదం నుంచి భారీ ముప్పు పొంచి ఉందనేందుకు ఇదొక హెచ్చరికలాంటిదని పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ లో పర్యటించినందువల్లే ఈ దాడులు జరిగాయని అంటున్నారని, అయినా ఆ రెండు దేశాల (భారత్, పాక్) నేతలు ఏమాత్రం ఈ దాడులకు వెరవకుండా పరిష్కార మార్గాల కోసం ముందుకెళ్లాలని సూచించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంకోసం చిన్న మూలాన్ని కూడా వదిలి పెట్టవద్దని, దాన్ని రూపుమాపి ఇరు దేశాలకు న్యాయం చేసుకోవాలని షెర్మాన్ అన్నారు. అయితే ఉగ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో భారత్, పాక్ లకు అమెరికా సహకారం అందించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News