: డెల్ లో విలీనమైతే భారీగా ఉద్యోగుల తొలగింపు: ఈఎంసీ


ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న డెల్ లో విలీనం కుదిరితే, భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని గ్లోబల్ డేటా స్టోరేజ్ దిగ్గజం ఈఎంసీ వెల్లడించింది. సాలీనా 850 మిలియన్ డాలర్లను ఆదా చేసుకోవాలన్నది తమ అభిమతమని, అందుకు తగ్గట్టుగా రీస్ట్రక్చరింగ్ ప్లాన్ ను గత వారం ఆమోదించామని స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు వెల్లడించిన ప్రకటనలో ఈఎంసీ పేర్కొంది. కాగా, ఇప్పటికే తమ ఐటీ సేవల వ్యాపారంలో 80 శాతం వాటాను క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ వీఎం వేర్ కు ఈఎంసీ విక్రయించిన సంగతి తెలిసిందే. "ఉద్యోగుల తొలగింపును ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రారంభిస్తాం. ఆపై డిసెంబరులోగా పూర్తి చేస్తాం. 220 మిలియన్ డాలర్ల మేరకు నగదు చెల్లింపులు జరపనున్నాం" అని సంస్థ వెల్లడించింది. కాగా, గత సంవత్సరం అక్టోబరులో డెల్, ఈఎంసీల మధ్య విలీనం డీల్ ఖరారైన సంగతి తెలిసిందే. మొత్తం 65.97 బిలియన్ డాలర్లతో ఈఎంసీని కొనుగోలు చేసేందుకు డెల్ అంగీకరించింది. ప్రస్తుతం ఈఎంసీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న కార్యాలయాల్లో 70 వేల మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికులను తిరిగి కొనసాగించేందుకు డెల్ సుముఖంగా లేకపోవడమే, ఉద్యోగుల తొలగింపునకు కారణమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News