: నటుడు శింబుకు ముందస్తు బెయిల్... వాయిస్ టెస్టుకు హాజరుకావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం
తమిళ నటుడు శింబుకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బీప్ సాంగ్ వ్యవహారంలో ఏ క్షణంలోనైనా పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తలతో బెయిల్ కోసం శింబు కోర్టుకు వెళ్లారు. గత నెల 22న తొలుత విచారణకు రాగా ముందస్తు బెయిల్ ను నిరాకరిస్తూ తుది విచారణను ఈ నెల నాలుగవ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఆలోపు పోలీసులు శింబును అరెస్టు చేయవచ్చునని కూడా ప్రకటించారు. నిన్న(సోమవారం) పిటిషన్ పై మళ్లీ విచారణ జరిగింది. కేసును పరిశీలించిన న్యాయమూర్తి... శింబుకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా ఉండేంత బలమైన కారణాలేవి లేవన్నారు. ఆ వెంటేనే బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బీప్ సాంగ్ వ్యవహారంలో పోలీసులు వాయిస్ టెస్టుకు అనుమతి కోరిన నేపథ్యంలో అందుకు సహకరించాలని శింబును న్యాయమూర్తి ఆదేశించారు. అదేవిధంగా శింబును కోవై, రేస్ కోర్స్ పోలీసులు ఇవాళ విచారణ హాజరుకావాలని నోటీసులు ఇచ్చినందున ఈ నెల 11న వారి విచారణకు వెళ్లాలని కోర్టు తీర్పులో పేర్కొంది.