: అమెరికాపైనా డ్రాగన్ దెబ్బ... 2008 తరువాత 'వాల్ స్ట్రీట్'కు వరస్ట్ స్టార్ట్!
చైనా భారీ పతనం ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ పైనా పడింది. దీంతో నాస్ డాక్ 2001 తరువాత, డౌ జోన్స్ 2008 నాటి మాంద్యం తరువాత అతిపెద్ద నష్టంలో మొదలైంది. రెండు సూచికలూ ఒకటిన్నర శాతానికి మించి పడిపోయాయి. సోమవారం నాటి సెషన్లో చైనా మార్కెట్ 7 శాతం పతనమై ట్రేడింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం ఆసియా, ఐరోపా, అమెరికా మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. డౌజోన్స్ పారిశ్రామిక సరాసరి 1.58 శాతం దిగజారి 276 పాయింట్ల పతనంతో 17,148 పాయింట్లకు, ఎస్అండ్ పీ-500 సూచిక 32 పాయింట్లు పడిపోయి 1.53 శాతం నష్టంతో 2,012 పాయింట్లకూ చేరగా, నాస్ డాక్ కాంపోజిట్ సూచిక ఏకంగా 2 శాతానికి పైగా పడిపోయి 104 పాయింట్లు దిగజారి 4,903 పాయింట్లకు చేరాయి. ఇక మంగళవారం నాటి ఫారెక్స్ సెషన్లో చైనా కరెన్సీ నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. కొరియా, హాంకాంగ్, తైవాన్ సూచీలు నష్టాల్లో సాగాయి. షాంగై కాంపోజిట్ సూచిక 0.4 శాతం లాభంలో ఉంది. సెన్సెక్స్ సూచి నామమాత్రపు లాభాల్లో నడుస్తోంది.