: ఆదరిస్తే పూజిస్తాం... వంచిస్తే లడాయే!: గడ్కరీకి అర్థమయ్యేలా హిందీలోనే తేల్చిచెప్పిన కేసీఆర్
తనదైన శైలి ప్రసంగంలో దూసుకెళ్లే గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న వరంగల్ లో జరిగిన కార్యక్రమంలో భాగంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి షాకిచ్చారు. నిన్నటి తెలంగాణ పర్యటనలో భాగంగా నితిన్ గడ్కరీ కొత్త రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులనే ప్రకటించారు. అయితే కొత్త రాష్ట్రమైన తెలంగాణకు మరింత మేర సహకరించాల్సిందేనని కేసీఆర్ ఆయనకు తేల్చిచెప్పారు. గడ్కరీకి అర్థమయ్యేలా హిందీలోనే ప్రసంగించిన కేసీఆర్... ఆదరిస్తే పూజిస్తామని, అదే సమయంలో వంచిస్తే మాత్రం లడాయేనని వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో జాతీయ రహదారుల సంఖ్య అత్యంత తక్కువగా ఉందని పేర్కొన్న కేసీఆర్ మరింత మేర సహకారాన్ని కోరారు. ‘‘ఆదరించిన వారిని గుండెల్లో పెట్టుకుని పూజించడం, వంచించిన వారిపై పోరాడి సాధించుకోవడం తెలంగాణ ప్రజల వ్యక్తిత్వం. తెలంగాణకు జాతీయ రహదారులతో పాటు మరిన్ని వరాలు కురిపించిన గడ్కరీని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో ఏ విధంగా స్పందించాలో అర్థం కాక గడ్కరీ కాస్తంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.