: మల్లాది విష్ణు అజ్ఞాతం వీడతారా?
బెజవాడ కల్తీ మద్యం కేసులో నిన్న విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును రేపు (జనవరి 6) కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మల్లాది విష్ణు సోదరుడి పేరిట ఉన్న స్వర్ణ బార్ లో మద్యం తాగిన ఐదుగురు వ్యక్తులు చనిపోగా, 25 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మల్లాది విష్ణు సోదరుడు శ్రీనివాస్ సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను 9 వ నిందితుడిగా చేర్చారు. నాటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన మల్లాది విష్ణు అటు పోలీసులకు గాని, ఇటు కోర్టుకు గాని అందుబాటులో లేకుండా పోయారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తమ ముందు హాజరుకావాలన్న కోర్టు ఆదేశాలను మల్లాది విష్ణు పాటిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కోర్టు ఆదేశాల మేరకు మల్లాది విష్ణు అజ్ఞాతం వీడి కోర్టుకు వస్తే, ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రేపు కోర్టు పరిసరాలపై నిఘా పెట్టాలని పోలీసు బాసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రేపటి పరిణామాలపై విజయవాడలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.