: ఎన్ఐఏ అధికారుల విచారణలో సల్వీందర్...పొంతన లేని సమాధానాలు చెబుతున్న వైనం
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడిలో ఆ రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన సీనియర్ అధికారి సల్వీందర్ సింగ్ వ్యవహార సరళి ప్రశ్నార్థకంగా మారింది. సీనియర్ పోలీసు అధికారి హోదాలో ఉన్న సల్వీందర్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వదిలేసి నగల వ్యాపారం చేస్తున్న ఓ స్నేహితుడు, వంట మనిషితో కలిసి పఠాన్ కోట్ వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సల్వీందర్ తో పాటు ఆయన వంట మనిషి మదన్ గోపాల్ లను అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా సల్వీందర్ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారట. తమను అపహరించిన ఉగ్రవాదుల సంఖ్యపై ఆయన ముందో మాట, ఆ తర్వాత మరో మాట చెప్పినట్లు సమాచారం. ఇక అత్యంత రహస్యంగా పఠాన్ కోట్ వెళ్లాల్సిన అవసరమేమిటన్న విషయంపై సల్వీందర్ నోరు విప్పడం లేదని సమాచారం. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు బయలుదేరిన ఉగ్రవాదులు, సల్వీందర్ కారు కంటే ముందు మరో కారును వినియోగించారు. సదరు కారు డ్రైవర్ ను ఉగ్రవాదులు చంపేశారు. మరి పోలీసు అధికారి అయిన తనను ఎలా విడిచిపెట్టారన్న ప్రశ్నకు సల్వీందర్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. నీలి బుగ్గ ఉన్న కారులో పఠాన్ కోట్ వెళ్లిన సల్వీందర్, పోలీస్ డ్రెస్ లో కాక సివిల్ డ్రెస్ లో ఉన్నారు. తాను పోలీసు అధికారిని కాదని, సాధారణ పౌరుడినని ఉగ్రవాదులను కన్విన్స్ చేయగలిగానని సల్వీందర్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారట. పొంతన లేని సమాధానాలు చెబుతున్న సల్వీందర్, ఆయన వంట మనిషి మదన్ గోపాల్ లను నేడు కూడా విచారించే అవకాశాలున్నట్లు సమాచారం.