: 'మండే టెస్టు' పాస్...ఢిల్లీ వాసుల్లో ఆనందం
జనవరి 1 నుంచి ఢిల్లీలో సరి-బేసి సంఖ్యల విధానం అమలులోకి వచ్చింది. అయితే జనవరి 1న చాలా మంది సెలవు తీసుకోవడంతో దీని అమలుపై వాస్తవ స్పందన తెలియలేదు. 2, 3వ తేదీలు శని, ఆది వారాలు కావడంతో ఢిల్లీ వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో వాస్తవంగా ఎంత మంది ఈ విధానానికి మద్దతు పలుకుతున్నారు? ఎంత మంది దీనిపై విముఖంగా ఉన్నారు? అనే విషయాలు తెలియలేదు. దీంతో అంతా సోమవారం గురించి ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సరి-బేసి సంఖ్య విధానం విజయవంతమైంది. సోమవారం వాహనదారులు సరి సంఖ్యలు కలిగిన కార్లను మాత్రమే బయటకు తీశారు. బేసి సంఖ్యలు కలిగిన వారంతా కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైల్ కిక్కిరిసిపోయాయి. సుమారు 200 మంది నిబంధన ఉల్లంఘించడంతో వారందరికీ భారీ జరిమానా పడింది. కేవలం సరి సంఖ్యలు కలిగిన కార్లు మాత్రమే రోడ్డెక్కడంతో ట్రాఫిక్ జామ్ లు లేవు. నిత్యం రద్దీగా కనిపించే జంక్షన్లు కూడా ఏ మాత్రం రద్దీ లేకుండా సాగిపోవడం విశేషం. దీంతో ఢిల్లీ వాసులు సరి-బేసి విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విధానానికి అనూహ్యమైన మద్దతు తెలిపారు.