: సర్దార్జీలపై జోక్ లు వారిని బాధిస్తే తప్పకుండా నిషేధిస్తాం: సుప్రీంకోర్టు


సర్దార్జీలపై లెక్కలేనన్ని జోక్ లు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఈ జోక్ లు ఎంతో కాలంగా హల్ చల్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని నవ్వించే విధంగా ఉండగా, మరికొన్ని వారిని కించపరిచే విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటువంటి జోకులపై నిషేధం విధించాలని కోరుతూ మహిళా న్యాయవాది హర్వీందర్ చౌదరి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో సర్దార్జీలపై వస్తున్న జోకులు వారిని బాధించినట్లయితే వాటిని నిషేధిస్తామని, కాకపోతే ఆయా కమ్యూనిటీల ప్రతిస్పందన మేరకు తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కాగా, ఈ కేసు వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో అడిషినల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ పట్వాలియా కూడా అక్కడే ఉన్నారు. దీంతో, తన అభిప్రాయాన్ని వెల్లడించాల్సిందిగా న్యాయమూర్తులు ఆయనను కోరారు. సర్దార్ వర్గీయులు హాస్యప్రియులని... అందుకే వాళ్ల పేరుతో పలు రకాల జోకులు పుట్టుకొచ్చాయని.. వాటిని ఎంజాయ్ చేస్తామని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలకు హర్వీందర్ చౌదరి అడ్డుతగిలారు. సర్దార్జీలపై జోకులతో వారు ఇబ్బంది పడుతున్నారని ఆమె వాదించింది. కాగా, ఇదే విషయమై ఢిల్లీ సిక్ గురుద్వార్ మేనేజ్ మెంట్ కమిటీ (డీఎస్జీఎంసీ) గతంలో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ కూడా త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు పిటిషన్లను కలిపి త్వరలో విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

  • Loading...

More Telugu News