: సెషన్ ముగియడంతో ఆగిన మార్కెట్ పతనం... లేకుంటే...!
"హమ్మయ్య... ఓ మార్కెట్ సెషన్ ముగిసింది. లేకుంటే పతనం ఇంకెంత దూరం సాగేదో!" నేటి భారత స్టాక్ మార్కెట్ సెషన్ కదలాడిన తీరును చూసిన సగటు ఇన్వెస్టర్ మదిలోని మాట ఇది. చైనా పారిశ్రామికోత్పత్తి పతనం, ఆపై లిస్టెడ్ కంపెనీల ఈక్విటీల విక్రయాలపై తొలగించిన నిషేధం ప్రభావం ఆ దేశ సూచిక లోయర్ అవధులను దాటి పతనం కాగా, ట్రేడింగ్ నిలిపివేసిన ప్రభావం, వరల్డ్ మార్కెట్ పై స్పష్టంగా కనిపించింది. భారత స్టాక్ మార్కెట్ దాదాపు రూ. 1.58 లక్షల కోట్ల మార్కెట్ కాప్ ను కోల్పోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు కుదేలయ్యాయి. అన్ని ఆసియా మార్కెట్లూ ఘోర పతనాన్ని చవిచూశాయి. తదుపరి సెషన్లలో సైతం ఇదే విధమైన కదలికలు నమోదవుతాయని నిపుణులు హెచ్చరించారు. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపు కంటే 50 పాయింట్ల నష్టంలో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచికలు ఏ దశలోనూ కోలుకోలేదు సరికదా, సమయం గడిచేకొద్దీ నష్టాలను పెంచుకుంటూ వెళ్లాయి. గత వారాంతంలో రూ. 1,09,33,953 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 99,38,322 కోట్లకు తగ్గి ఇన్వెస్టర్లకు నిద్రలేని రాత్రిని మిగిల్చింది. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 537.55 పాయింట్లు పడిపోయి 2.05 శాతం నష్టంతో 25,623.35 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 171.90 పాయింట్లు పడిపోయి 2.16 శాతం నష్టంతో 7,791.30 పాయింట్ల వద్దకు చేరాయి. నిఫ్టీ అత్యంత కీలకమైన 7,900 వద్ద, ఆపై 7,800 పాయింట్ల వద్ద కొనుగోలు మద్దతును కూడగట్టుకోవడంలో విఫలం కావడం ఇన్వెస్టర్ వర్గాల మదిలో ఆందోళన కలిగించే అంశమే. ఇక బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.20 శాతం, స్మాల్ క్యాప్ 1.11 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 3 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. టాటా స్టీల్, ఆసియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీలు లాభపడగా, టాటా మోటార్స్, ఐడియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హిందాల్కో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,985 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,289 కంపెనీలు లాభాలను, 1,599 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.