: క్రిస్టియన్ అనుబంధ విభాగాన్ని ప్రారంభించనున్న ఆర్ఎస్ఎస్!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలు, క్రిస్టియన్ విభాగాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు క్రైస్తవ సంఘాల నేతలతో ఆర్ఎస్ఎస్ పెద్దలు సమావేశమయ్యారు. దశాబ్దం క్రితం ముస్లిం రాష్ట్రీయ మంచ్ పేరిట ఆర్ఎస్ఎస్ అనుబంధ ముస్లిం సంఘాన్ని ప్రారంభించినట్టే, ఓ క్రిస్టియన్ అనుబంధ సంఘాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్టు ఓ సీనియర్ ఆర్ఎస్ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఇంద్రేష్ కుమార్ వెల్లడించారు. ఇటీవల 12 రాష్ట్రాలకు చెందిన నలుగురు ఆర్చి బిషప్ లు, 40 మంది రెవరెండ్ బిషప్ లతో తాము చర్చించామని, క్రిస్టియన్ సంఘం ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభించామని ఆయన వివరించారు. భారత గడ్డపై క్రైస్తవులు శాంతి, ప్రేమలను పంచుతున్నారని అందువల్ల వారితో తమకు బంధం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. కాగా, ఈ చర్చల్లో విశ్వ హిందూ పరిషత్ కు చెందిన చిన్మయానంద స్వామి కడా పాల్గొన్నారని సమాచారం. ప్రముఖ ఆర్చి బిషప్ లు మార్ కురియాకోస్ భరణికులంగరా, బిషప్ జాకబ్ మార్ బార్నబాస్, బిషప్ ఇసాక్ ఓస్థాతియోస్, నార్త్ ఇండియా చర్చ్ జనరల్ సెక్రటరీ అల్వాన్ మాసిహ్ తదితరులు హాజరయ్యారు.