: ఢిల్లీలో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ-బైక్స్
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం అమలవుతున్న సరి-బేసి ట్రయల్ రన్ లో భాగంగా ఈ-బైక్స్ (ఎలక్ట్రిక్ బైసికిల్) కూడా చేరాయి. వాటితో మెట్రోస్టేషన్ లకి, బస్ స్టేషన్ లకు సులభంగా చేరుకోవచ్చు. ప్రముఖ మోటారు వాహనాల సంస్థ 'హీరో' ఈ బైక్స్ ను అందిస్తోంది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఉచితంగా 100 ఈ-బైక్స్ ని అందిస్తున్నట్టు తెలిపింది. ఢిల్లీలో కాలుష్య నివారణపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ ఇవాళ జెండా వూపి ప్రారంభించారు. ఢిల్లీలోని 15 ప్రాంతాల్లో ఈ-బైక్స్ ని అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. ఒక్కో ప్రాంతంలో 5 నుంచి 10 వరకు ఈ ద్విచక్రవాహనాలు ఉంటాయి. వాటి సాయంతో ప్రజలు మెట్రో స్టేషన్స్, బస్ స్టేషన్ లకు ఉచితంగా చేరుకోవచ్చన్నమాట. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు.