: తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై హైకోర్టు విచారణ... ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు అనుమతి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. గతంలో తమ ఆదేశాల మేరకు రైతులతో సమావేశం నిర్వహించారా? అని కోర్టు ప్రశ్నించగా, రైతు ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని వారు సూచించారని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు సూచన మంచిదేనని, వెంటనే స్టేట్ ఫార్మర్ కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు పేర్కొంది. ఈ సూచనల అమలుకు మరికొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరగా, ఆరు వారాల్లోగా నిర్ణయం చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. మరోవైపు ఇసుక అక్రమ తవ్వకాలపై కూడా ఈరోజు విచారణ జరిగింది. ఉన్నత స్థాయి కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారని రెండు తెలుగు రాష్ట్రాలను కోర్టు అడిగింది. సంక్రాంతి సెలవుల తరువాత వివరాలను తెలపాలని ఆదేశించింది.