: రైల్వే స్టేషన్లలో రూ. 20కే పరిశుభ్రమైన, ఆరోగ్యకర భోజనం!


రైళ్లలో ఒక రోజు మించి ప్రయాణించే వారిని అమితంగా వేధించే సమస్యల్లో ఆహారం ఒకటి. రుచి, పచి లేని ఆహారాన్ని అపరిశుభ్ర వాతావరణం మధ్య తినాల్సి వస్తోందని వాపోని వారుండరు. కానీ, ఈ పరిస్థితి మారుతుందని ఐఆర్సీటీసీ ఘంటాపథంగా చెబుతోంది. రూ. 20 కన్నా తక్కువ ధరలో భోజనాన్ని అందించే జన్ ఆహార్ క్యాంటీన్లను అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంలపై ఏర్పాటు చేస్తామని అంటోంది. 24 గంటలూ సేవలందించే ఈ ఏసీ క్యాంటీన్లలో జనతా మీల్స్, ఎకానమీ మీల్స్ తో పాటు ఉత్తర, దక్షిణాది వంటకాలు లభిస్తాయని చెబుతోంది. సెల్ఫ్ సర్వీస్ సిస్టమ్ లో పనిచేసే ఈటరీల్లో 8 నుంచి 12 మంది వరకూ కూర్చునే వీలుంటుందని, ఎంపిక చేసిన ఐస్ క్రీమ్స్, శీతల పానీయాలు లభిస్తాయని, ఉచిత మినరల్ వాటర్ ఉంటుందని వెల్లడించింది. కంప్యూటరైజ్డ్ బిల్లింగ్, వండుతున్న వంటకాలు కనిపించేలా గ్లాస్ పార్టీషన్ ఉంటుందని ఐఆర్సీటీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని స్టేషన్లలో జన ఆహార్ క్యాంటీన్లు ఏర్పాటు కాగా, ప్రజల అభిప్రాయాల సేకరణ అనంతరం మిగతా ప్రాంతాలకు విస్తరించాలన్నది రైల్వే అధికారుల ఆలోచన.

  • Loading...

More Telugu News