: టీఆర్ఎస్ గ్రేటర్ డివిజన్ ఇన్ చార్జిలకు ప్రత్యేక కిట్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రణాళికతో ముందుకెళుతోంది. క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకర్షించుకునేందుకు నూతన ప్రణాళికను చేపట్టింది. ఇప్పటికే డివిజన్ల వారీగా పార్టీ ముఖ్య నేతలను ఇన్ చార్జీలుగా నియమించిన సంగతి తెలిసిందే. ఒక్కో డివిజన్ ఇన్ చార్జీకి ప్రచార సామగ్రితో కూడిన కిట్ ను అందజేయాలని నిర్ణయించింది. ఆ కిట్ లో డివిజన్ స్వరూపం, ఓట్లు, ఆ డివిజన్ లో నెలకొన్న సమస్యలు, ఇప్పటివరకు ప్రభుత్వం పరిష్కరించిన సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తామేం చేయబోతున్నామన్న అంశాలతో కూడిన భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది. ప్రభుత్వం ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారుల వివరాలతో కిట్ ను అందజేయనున్నారు. ఈ కిట్ లో అందించిన సమాచారం ఆధారంగా ఇన్ చార్జీలు ప్రచారం చేయనున్నారు. ఈ కిట్ సహా సాయంత్రంలోగా డివిజన్ ఇన్ చార్జీలు క్షేత్ర స్థాయిలోకి వెళ్లాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.