: పాతాళానికి చైనా మార్కెట్... ట్రేడింగ్ నిలిపివేత, అదే దారిలో జపాన్, హాంకాంగ్!
పశ్చిమాసియాలో నెలకొన్న భయాందోళనలకు తోడు చైనాలో మాంద్యం, 2015 చివరి త్రైమాసికంలో కంపెనీల లాభాలు గణనీయంగా తగ్గడం, జపాన్ లో పీఎంఐ (పర్చేజ్ మేనేజింగ్ ఇండెక్స్) పతనం తదితర కారణాలు నేటి ప్రపంచ స్టాక్ మార్కెట్ ను కుదేలు చేశాయి. చైనా మార్కెట్ సూచిక షాంగై కాంపోజిట్ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా 7 శాతానికి మించి పడిపోయి పాతాళానికి చేరడంతో, ప్రభుత్వం కల్పించుకుని ట్రేడింగ్ ను నిలిపివేసింది. జపాన్ మార్కెట్ సూచి నిక్కీ 3.16 శాతం, హాంకాంగ్ సూచిక హాంగ్ సెంగ్ 2.86 శాతం నష్టపోయాయి. ఇక కొరియన్ సూచిక కోస్పీ 2.22 శాతం నష్టపోయింది. ఇదిలావుండగా, భారత మార్కెట్లో సెన్సెక్స్ ఉదయం 11:45 గంటల సమయంలో 406 పాయింట్లు నష్టపోయి 1.56 శాతం పతనంతో 25,753 పాయింట్లకు చేరి బేల చూపులు చూస్తోంది. నిఫ్టీ 127 పాయింట్లు పడిపోయి 7,835 పాయింట్లకు చేరింది. యూఎస్ ప్రధాన సూచిక నాస్ డాక్ ఫ్యూచర్స్ 1.17 శాతం పతనాన్ని సూచిస్తోంది.