: జైషేపై 72 గంటల్లోగా కఠిన చర్యలు... పాక్ కు అల్టిమేటం జారీ చేయనున్న భారత్
భారత్, పాకిస్థాన్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ ల మధ్య వరుస భేటీల నేపథ్యంలో ఈ నెల 15న ఇరు దేశాల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు మొదలు కానున్నాయి. సదరు చర్చలకు సంబంధించిన రోడ్ మ్యాప్ రూపకల్పన కోసం ఇరు దేశాల అధికారులు నేడు భేటీ కానున్నారు. ఈ భేటీలో భారత్ వ్యవహరించాల్సిన వ్యూహం ఇప్పటికే ఖరారైంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడి పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ పనేనని భారత్ భావిస్తోంది. సదరు ఉగ్రవాద సంస్థపై 72 గంటల్లోగా కఠిన చర్యలు తీసుకోవాలని భారత్, పాక్ ను కోరనుంది. జైషేపై తీసుకోబోయే కఠిన చర్యలపైనే 15న జరగనున్న విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీ ఆధారపడి ఉంటుందని కూడా భారత వర్గాలు తేల్చిచెప్పనున్నాయి. ఈ మేరకు పాక్ పై ఒత్తిడి పెంచాల్సిందేనన్న కోణంలో భారత్ వ్యూహాన్ని రచించింది. జైషేపై చర్యలకు పాక్ వెనుకాడితే, భవిష్యత్ చర్చలు కూడా నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదన్న భావన వచ్చేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. దీంతో నేటి రోడ్ మ్యాప్ చర్చలపై ఇరు దేశాల్లో ఆసక్తి నెలకొంది.