: రాందేవ్ బాబాతో పోరుకు దిగనున్న డాబర్!
పతంజలి బ్రాండ్ పేరిట బాబా రాందేవ్ మార్కెటింగ్ చేస్తున్న ఆయుర్వేద ఉత్పత్తులను దీటుగా ఎదుర్కొనేందుకు దేశవాళీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే హిందుస్థాన్ యూనీలివర్ 'ఆయుర్వేద' పోరుకు 'సై' అంటూ, తమ పాత ఆయుష్ బ్రాండ్ ను తిరిగి మార్కెట్లోకి వదిలిన వేళ, డాబర్ సైతం కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించనుంది. దాదాపు రూ. 7,800 కోట్ల అమ్మకాలను ప్రతియేటా సాగిస్తున్న సంస్థ, మహిళలు, చిన్నారుల ఆరోగ్యం తదితర శ్రేణుల్లో ఆయుర్వేద ఉత్పత్తులను మరిన్ని విడుదల చేయనుంది. కాగా, ఇప్పటికే డాబర్ మార్కెటింగ్ చేస్తున్న చవనప్రాశ అత్యధిక అమ్మకాలతో నమ్మకమైన బ్రాండ్ గా భారత్ లో కొనసాగుతోంది. డాబర్ కు వచ్చే మొత్తం ఆదాయంలో 40 శాతం చవనప్రాశ అమ్మకాల నుంచి వస్తున్నదే. సమీప భవిష్యత్తులో దశమూలారిష్ట, అశోకారిష్టలను ఫ్రూట్ ఫ్లేవర్లలో విడుదల చేయనున్నట్టు డాబర్ ఇండియా కేటగిరీ హెడ్ రామారావు ధమిజా వ్యాఖ్యానించారు. ఆరోగ్యంతో పాటు రుచికీ ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ అభిమతమని తెలిపారు. ఇక రాందేవ్ ఏ అడుగు వేస్తారో వేచి చూడాలి.