: శింబూ తండ్రి ఇంటికి బాంబు బెదిరింపు... రంగంలోకి దిగిన తమిళ పోలీసులు


తమిళ యువ నటుడు శింబూ బీప్ సాంగ్ వివాదంలో పీకల్లోతు కూరుకుపోయాడు. అసభ్య పదజాలంతో కూడిన సదరు బీప్ సాంగ్ అతడిని చాలా రోజుల పాటు అండర్ గ్రౌండ్ కు పంపగా, ఏకంగా అతడి తల్లిని కంట తడిపెట్టించింది. తాజాగా శింబూ తండ్రి, సీనియర్ నటుడిగానే కాక దర్శక నిర్మాతగానూ ఓ వెలుగు వెలిగిన టి.రాజేంద్రన్ కు బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. చెన్నైలోని పోరూర్ కు చెందిన శెట్టియార్ అగరంలో రాజేంద్రన్ కు పెద్ద బంగళా ఉంది. సదరు బంగ్లాలో బాంబు పెట్టినట్లు శనివారం మధ్యాహ్నం పోలీస్ కంట్రోల్ రూంకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అక్కడికి సమీపంలోని మధురవాయిల్ పోలీసులను కంట్రోల్ రూం అప్రమత్తం చేసింది. హుటాహుటిన రాజేంద్రన్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఇంటిలో క్షుణ్ణంగా సోదాలు చేశారు. సోదాల్లో బాంబు కనిపించకపోవడంతో బెదిరింపు కాల్ ఉత్తిదేనని తేలిపోయింది. ఆ తర్వాత తమకు వచ్చిన ఫోన్ నెంబరుకు పోలీసులు ఫోన్ చేశారు. ఆ కాల్ ను అటెండ్ చేసిన ఓ మహిళ, మగ గొంతుతో తానే బెదిరింపు కాల్ చేసినట్లు చెప్పేసి ఫోన్ కట్టేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు సదరు మహిళ కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News