: కారు అద్దంతో పులి కుస్తీ!... పక్కనే మనుషులున్నా వారివైపు కన్నెత్తి చూడని వైనం
మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు సమీపంలోని ఉమ్రెద్ కర్హాండ్లా వన్యప్రాణి అభయారణ్యంలో ఇటీవల ఓ వింత చోటుచేసుకుంది. ఆకలితో నకనకలాడుతున్న ఓ పులి తన కంటబడ్డ కారు వద్దకు వచ్చేసింది. కారు అద్దాన్ని తినేందుకు నానా తంటాలు పడింది. ఎంత యత్నించినా సదరు అద్దం తన నోటికి ఇమడలేదు. మరి కారులో ఎవరూ లేరా? అంటే, ఎందుకు లేరు, ఐదుగురు వ్యక్తులు కారులో నిశ్చింతగా కూర్చున్నారు. డ్రైవర్ క్యాబిన్ కు అద్దాలున్నా, వెనుక వైపు సదరు కారు ఓపెన్ టాప్ గానే ఉంది. అందులో ఏకంగా ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. అయినా ఆ పులి వారి వైపు కన్నెత్తి చూడలేదు. తనకు ఆహారంగా ఉపయోగపడే ఏ వస్తువునైనా, కిలో మీటర్ల దూరం నుంచి ఇట్టే తన ముక్కుపుటాలతో పసిగట్టే సదరు పులి... కారు వద్దకు వచ్చినా, అందులో దర్జాగా కూర్చున్న వ్యక్తుల వైపు కన్నెత్తి చూడలేదు. మామూలుగా పులిని చూస్తేనే ఎవరైనా సరే బిక్కచచ్చిపోయి పరుగు లంకించుకోవడం మనకు తెలిసిందే. అయితే అందుకు విరుద్ధంగా కారులోని వ్యక్తులు పులి అక్కడే కారు అద్దంతో కుస్తీలు పడుతున్నా, ఏమాత్రం భయపడకుండా సదరు పులి చేష్టలను సెల్ ఫోన్ కెమెరాలో బంధించేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.