: భూకంపానికి నిర్మలా సీతారామన్ గది కదిలిపోయింది!...ట్విట్టర్లో పేర్కొన్న కేంద్ర మంత్రి
బీజేపీ సీనియర్ నేత, తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ భూకంప ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. నిన్న రాత్రి భారత్-మయన్మార్ సరిహద్దులో పెను భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ఈశాన్య రాష్ట్రాల్లోని కాఫీ తోటలను పరిశీలించేందుకు అక్కడి పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు నిన్న వెళ్లారు. సరిగ్గా భూకంపం సంభవించిన సమయంలో ఆమె పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో ఉన్నారు. అక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న సీతారామన్, భూకంపం ప్రభావంతో తానున్న చోటు కూడా కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడంతో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై నిర్మలా సీతారామన్ వెనువెంటనే ట్విట్టర్లో స్పందించారు. భూకంపం కారణంగా తానున్న గది కూడా కదిలిపోయిందని ఆమె పేర్కొన్నారు. ‘‘సిలిగురిలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో నేను ఉన్న గది కూడా కంపించిపోయింది. అంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా’’ అంటూ ఆమె ట్వీటారు.