: భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం...ఇరు దేశాల్లో కంపించిన భూమి
ఈశాన్య భారతంలోని పలు రాష్ట్రాల్లో నిన్న రాత్రి భూప్రకంపనలు సంభవించాయి. భారత్-మయన్మార్ సరిహద్దులో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్, నాగాలాండ్ లలోని పలు ప్రాంతాలతో పాటు మయన్మార్ లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఉన్నపళంగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణాలరచేతబట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మణిపూర్ లోని టామింగ్ గ్లాంగ్ జిల్లాలో భూమికి 17 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ భూకంపం కారణంగా మణిపూర్ రాజధాని ఇంపాల్ లో ఓ వ్యక్తి మరణించగా, మరో 8 మంది దాకా గాయపడ్దారు. మిగిలిన ప్రాంతాల్లో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.