: ఇన్వెస్టర్ల కళ్లు క్రూడాయిల్, రూపాయిపైనే!
భారత స్టాక్ మార్కెట్ ను ముందుకు తీసుకెళ్లేలా సమీప భవిష్యత్తులో ఎటువంటి వార్తలు, నిర్ణయాలు వెలువడే అవకాశాలు లేకపోవడంతో, క్రూడాయిల్ ధరలు, రూపాయి మారకపు విలువలపైనే విదేశీ ఇన్వెస్టర్ల దృష్టి ఉందని నిపుణులు వ్యాఖ్యానించారు. "అంతర్జాతీయ మార్కెట్ల గమనంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా చూస్తున్నారు. క్రిస్మస్ సెలవుల అనంతరం విదేశీ మార్కెట్ల గమనం తదుపరి సెన్సెక్స్, నిఫ్టీల పై ప్రభావాన్ని చూపనుంది" అని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ వ్యాఖ్యానించారు. ఇక ఫిబ్రవరిలో వచ్చే బడ్జెట్ పై వచ్చే అంచనాల వార్తలు, సంస్కరణల అజెండా కూడా మార్కెట్ పై ప్రభావం చూపనున్నాయని ఆయన అన్నారు. కొంతమేరకు లాభాల స్వీకరణ ప్రభావం మార్కెట్ ను అడ్డుకోవచ్చని భావిస్తున్నట్టు వివరించారు. సోమవారం నాటి సెషన్లో ఆటో కంపెనీల ఈక్విటీలు కీలకం కానున్నాయని, ఈ సంస్థలు తమ నెలవారీ గణాంకాలను విడుదల చేశాయని గుర్తు చేశారు. కాగా, గత సంవత్సరం బీఎస్ఈ సెన్సెక్స్ 1,381 పాయింట్లు పడిపోయి 5 శాతం నష్టాన్ని నమోదు చేసుకుంది. సెప్టెంబర్ 8న 52 వారాల కనిష్ఠస్థాయి 24,833కు సెన్సెక్స్ పడిపోగా, 2014 గరిష్ఠంతో పోలిస్తే ఇది 30 శాతం పతనం.