: అమెరికా నుంచి గెంటివేయబడ్డ కావ్య... 9 గంటల ఇంటర్వ్యూలో సిల్లీ ప్రశ్నలు!
ఎలాగైనా అమెరికాలో చదవాలని హైదరాబాదు నుంచి వెళ్లిన తెలుగమ్మాయి కావ్యను ఇమిగ్రేషన్ అధికారిణి 9 గంటల పాటు కూర్చోబెట్టి, పలు సిల్లీ ప్రశ్నలతో విసిగించి, ఆపై అన్ని కాగితాలూ బాగున్నాయని చెప్పి మరీ వెనక్కు పంపేశారు. తన అనుభవాలను కావ్య ఓ టీవీ చానల్ తో పంచుకుంది. "గత నెల 22న హైదరాబాద్ టూ దుబాయ్, ఆపై సియాటెల్ కు వెళ్లాను. నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సియాటెల్ లో ఉంది. విమానం దిగగానే ప్రైమరీ ఇన్ స్పెక్షన్ దగ్గర, వారు నన్ను ఏ యూనివర్శిటీకి వెళ్తున్నావని అడిగారు. నేను ఎన్పీయూ కాలిఫోర్నియా వర్శిటీకి వెళ్తున్నానని చెప్పాను. ఆ వెంటనే రెడ్ కార్డు ఇచ్చి చివరగా ఉన్న గదిలోకి వెళ్లమన్నారు. నేను ఆ కార్డు ఏంటని అడిగితే, సమాధానం చెప్పకుండా, ఆ గదిలోకి వెళితే, అక్కడున్న అధికారులు మిగతా వివరాలు చెబుతారని అన్నారు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అక్కడ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ మొదలైంది. ఓ అధికారి నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టారు. మీ నాన్న డేటాఫ్ బర్త్ ఏంటి? ఎక్కడ పుట్టారు? ఇక్కడ ఏ ఉద్యోగం చేయాలని అనుకుంటున్నావు? వంటి సంబంధం లేని సిల్లీ ప్రశ్నలతో 9 గంటలు విచారించారు. అన్ని సర్టిఫికెట్లు చెక్ చేసి, అన్ని జన్యూన్ డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పారు. ఆపై మరో అధికారిణి వచ్చి సంతకం పెడతారని చెప్పారు. ఆమె వచ్చి నా సెల్ ఫోన్ మొత్తాన్నీ పరీక్షించమని కోరింది. ఆపై ఏం జరిగిందో ఏమో... తిరిగి వెనక్కు వెళ్లి పోవాలని ఆదేశించారు. ఎంతో సేపు ఏడుస్తూ ఉండిపోయాను" అని తన బాధను పంచుకున్నారు.