: ముగ్గురు విద్యార్థులను కిడ్నాప్ చేసిన మావోలు!
చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరో దారుణానికి ఒడిగట్టారు. 'భారత్ జోడో అభియాన్' పేరిట పూణే నుంచి ఒడిశా వరకూ సైకిళ్లపై శాంతి యాత్ర చేస్తున్న ముగ్గురు విద్యార్థులను కిడ్నాప్ చేశారు. బీజాపూర్ జిల్లా కుట్రు - బాసగూడ మార్గంలో ఈ ఘటన జరిగింది. శాంతి యాత్ర చేస్తున్న ఆదర్శ్, బిలాస్, శ్రీకృష్ణలను అటకాయించిన మావోలు వారిని దట్టమైన అడవుల్లోకి లాక్కెళ్లినట్టు పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పాలన్న లక్ష్యంతో వీరు గత నెలలో సైకిల్ యాత్రను ప్రారంభించినప్పుడు నేషనల్ మీడియా వీరి ఉద్దేశాలను ప్రముఖంగా ప్రచురించింది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ ప్రాంతాల మీదుగా ఒడిశాకు చేరాలన్నది వీరి లక్ష్యం. వీరిని విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మావోలకు వ్యతిరేకంగా ఈ ర్యాలీని చేస్తున్నందున వీరిని కిడ్నాప్ చేసి వుండవచ్చని, ఎవరైనా స్థానిక మావో నేత ఈ పని చేసుండవచ్చని వ్యాఖ్యానించారు.