: సీబీఐని వ్యతిరేకించేందుకు రూ. 1.25 కోట్లు ఖర్చు పెట్టిన మధ్యప్రదేశ్ సర్కారు!
మధ్యప్రదేశ్ లో జరిగిన అతిపెద్ద కుంభకోణం 'వ్యాపమ్' కేసులో సీబీఐ కోర్టులో దాఖలు చేస్తున్న పిటీషన్లను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 1.25 కోట్లను ఖర్చు పెట్టిందని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ (టీఐ) సభ్యుడు అజయ్ దూబే వెల్లడించారు. 2013 నుంచి 2015 మధ్య సీనియర్ న్యాయవాదులను నియమించుకుని, ఈ కుంభకోణం అసలు జరగనేలేదన్న వాదనతో కోర్టు ముందుకు ప్రభుత్వం వెళుతోందని ఆయన అన్నారు. కేసులో సీనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం ఎంత ఫీజు చెల్లిస్తుందన్న విషయాన్ని ఆర్టీఐ చట్టాన్ని ప్రయోగించి, స్టేట్ లీగల్ విభాగం నుంచి వివరాలు పొందామని వెల్లడించిన అజయ్, ఒక్కో న్యాయవాదికి లక్షల్లో ప్రభుత్వ సొమ్ము అందిందని అన్నారు. కాగా, కేంద్రంలో బీజేపీ పాలన సాగుతుండగా, సీబీఐ విచారణను వ్యతిరేకిస్తున్న తొలి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంగా మధ్యప్రదేశ్ సర్కారు నిలిచిన సంగతి తెలిసిందే.