: ఒకసారి పోతే ఇక అంతే: లాలూ
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీని వీడి వెళ్లిన వారెవరూ మరోసారి తిరిగి రాలేరని ఆ పార్టీ సుప్రీమో లాలూ ప్రసాద్ యాదవ్ హెచ్చరించారు. గతంలో ఆర్జేడీని వీడి బీజేపీ తదితర పార్టీల్లో చేరిన పలువురు నేతలు ఇప్పుడు తిరిగి రావాలని ప్రయత్నిస్తుండటాన్ని ప్రస్తావించిన ఆయన, వారిని తిరిగి స్వాగతించబోమని స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీకి దూరమైన వారెవరినీ తిరిగి పార్టీలోకి తీసుకోబోమని, పలువురు తనను తిరిగి వచ్చేందుకు అనుమతి కోరుతున్నారని, వారికి ఆ అవకాశం లేదని తెలిపారు. ఎవరైనా ఆర్జేడీలోకి వస్తామని సంప్రదిస్తే, ఇదే విషయాన్ని తెలియజేయాలని కింది స్థాయి నేతలకు లాలూ పిలుపునిచ్చారు. కొందరికి పార్టీలు మారడం అలవాటుగా మారిందని, ఇప్పుడు అధికారం కోసం వారు మరోసారి మనసు మార్చుకోవాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.