: ఇండియా అంటే భయపడుతున్న విదేశీ ఇన్వెస్టర్లు: జైట్లీ
ఇండియాలోకి ఆశించిన విదేశీ పెట్టుబడులు రాకపోవడానికి కారణం రెట్రాస్పెక్టివ్ టాక్స్ (పునరావృత పన్ను) అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇండియాలో పన్ను విధానంలో పారదర్శకత పెరగాల్సి వుందని అన్నారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిని ఉద్దేశించి జైట్లీ ప్రసంగించారు. "రెట్రాస్పెక్టివ్ టాక్స్ నిబంధనలు ఇండియాకు మేలు చేశాయా? కీడు చేశాయా? నా సమాధానం చాలా స్పష్టం. వాటి వల్ల కీడే జరిగింది. చివరకు ఇండియాకు పన్నుల రూపంలో ఏమీ రాలేదు సరికదా, ఇన్వెస్టర్లు భయపడుతున్నారు" అని ఆయన అన్నారు. కాగా, ఈ పన్నును 2012లో ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించగా, పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విదేశీ సంస్థలు, ఇండియాలోని కంపెనీల ఆస్తులను కొనుగోలు చేసిన పక్షంలో పన్ను చెల్లించాలి. ఇది చాలా దేశాలతో భారత్ చేసుకున్న పన్ను ఒప్పందాలకు వ్యతిరేకం. వోడాఫోన్ ఇండియాలోకి ప్రవేశించి హచ్ సన్ వాంపోవాను కొనుగోలు చేసిన లావాదేవీలో రూ. 20 వేల కోట్లు చెల్లించాలని భారత్ డిమాండ్ చేసింది. ఆపై కెయిర్న్ ఇండియా రూ. 10,247 కోట్లు కట్టాలని ఆదేశించింది. వీటిపై కోర్టులు విదేశీ సంస్థలకే అనుకూలమని చెప్పగా, ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు ఇంకా నడుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.