: 2 కోట్ల మంది ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు లాభం చేకూర్చేలా కేంద్రం నిర్ణయం!
ఇండియాలోని రెండు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగ వేతన జీవులకు మేలు చేకూరుస్తూ, యజమాని అటెస్టేషన్ లేకుండానే తమ పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్, పాన్ సంఖ్య, బ్యాంకు ఖాతా తదితర వివరాలను తమ యూఏఎన్ (యూనివర్సల్ ఎకౌంట్ నంబర్)కు జత చేసిన వారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. కాగా, ఇండియాలోని పీఎఫ్ ఖాతాదారుల్లో 2 కోట్ల మంది కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు ఈపీఎఫ్ఓ దగ్గరున్నాయని, వీరంతా తమ ఖాతాల నుంచి ఎప్పుడైనా డబ్బు తీసుకోవచ్చని పీఎఫ్ అధికారులు తెలిపారు. కాగా, ఇంతవరకూ ఏదైనా ఉద్యోగం మానేసిన రెండు నెలల తరువాత మాత్రమే విత్ డ్రావల్ దరఖాస్తును ఈపీఎఫ్ఓకు అందించే వీలుంది. మారిన నిబంధనలతో ఉద్యోగం వీడిన మరుసటి రోజు కూడా దరఖాస్తు చేయవచ్చు. గతంలో విత్ డ్రా దరఖాస్తుపై కంపెనీ యాజమాన్యం సంతకం చేయాల్సి వుండగా, ఇప్పుడా అవసరమూ తప్పింది. కాగా, ఈ దరఖాస్తులను పీఎఫ్ కార్యాలయాల్లో స్వయంగా ఉద్యోగే అందించాల్సి వుంటుంది.