: అమెరికా వెళ్లే విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ చెక్ పేరిట ఇంటరాగేషన్ చేస్తున్నారట!


గత కొన్ని రోజులుగా ఆమెరికాలోని కాలిఫోర్నియాలోని రెండు యూనివర్సిటీల్లో జాయిన్ అవడానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పిపంపడంపై అక్కడ యూనివర్శిటీలలో జాయిన్ అయిన విద్యార్థులు స్పందించారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను వివరించారు. ఇక్కడ పొందిన వీసాతో అమెరికా చేరుకున్నాక, అక్కడ ఇమ్మిగ్రేషన్ చెక్ చేసేది అమెరికా హోమ్ ల్యాండ్ ఆఫీసర్లని తెలిపారు. మామూలుగా అయితే ఇమ్మిగ్రేషన్ చెక్ పేరిట గంటల తరబడి వెయిటింగులో ఉంచరని, మహా అయితే అరగంటలో ఇమ్మిగ్రేషన్ చెక్ అయిపోతుందని వారు చెప్పారు. అయితే, కొంత మందిని మాత్రం నాలుగు నుంచి తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారని, ఒకవిధంగా చెప్పాలంటే అది ఇంటరాగేషన్ లాంటిదని వారు తెలిపారు. వీసా జారీ సందర్భంగా చెప్పిన సమాధానాలకు, ఇమ్మిగ్రేషన్ చెక్ సందర్భంగా సంధించే ప్రశ్నలకు చెప్పే జవాబులకు మధ్య తేడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదేనని వారు వివరించారు. ఈ సమాధానాల మధ్య ఏ మాత్రం తేడా వచ్చినా అమెరికా హోం ల్యాండ్ పోలీసులు ఇంటరాగేట్ చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా వెనక్కి వచ్చిన విద్యార్థులు మాట్లాడుతూ, నాలుగు నుంచి ఐదుగురు అధికారులు తమను పదేపదే ఓకే ప్రశ్నను అడిగేవారని చెప్పారు. ఒకరి తరువాత ఒకరు కాస్త గ్యాప్ ఇచ్చి వచ్చేవారని, మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలను అడిగేవారని వెల్లడించారు. వారు సంధించే ప్రశ్నలు చాలా చెత్త ప్రశ్నలని, వాటితో తమను విసిగించారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పంపిన కన్సల్టెంట్లు మాట్లాడుతూ, అమెరికా ఇమ్మిగ్రేషన్ లో ప్రధానంగా ఆర్థిక వనరులపై ప్రశ్నలు ఉంటాయని, ఆధారాలు చూపించినా, విద్యార్థులు చెప్పే సమాధానాలే ప్రభావితం చేస్తాయని అన్నారు. అదే సమయంలో అమెరికాలో ఉగ్రదాడులపై భయం పెరిగిందని, అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న దశలో ఇమ్మిగ్రేషన్ చెక్ మరింత కఠినంగా మారిందని వారు చెప్పారు. ప్రముఖ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ బలపడడంపై అక్కడి అధికారుల్లో భయాందోళనలు నెలకొన్నాయని, దీంతో ఆ దేశంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కర్నీ అనుమానంతో చూస్తున్నారని వారు పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే విద్యార్థులను వెనక్కి పంపినట్టు వారు పేర్కొన్నారు. దీనికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News