: 'స్వరకళా సామ్రాట్' పురస్కారంతో బాలసుబ్రహ్మణ్యంను సన్మానించిన చంద్రబాబు
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను స్వరకళా సామ్రాట్ పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సత్కరించారు. విశాఖపట్టణంలో విశాఖ ఉత్సవ్ లో పాల్గొన్న సందర్భంగా బాలుకి ఈ బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు జాతి కీర్తిని బాలు జగద్విదితం చేశారని అన్నారు. తన పాటల ద్వారా ఆయన తెలుగు భాషకు ఎంతో సేవ చేశారని అన్నారు. 50 ఎళ్ల పాటు ఆయన ఏకఛత్రాధిపత్యం సాగించారని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది వర్ధమాన గాయకులను ఆయన వెలుగులోకి తెచ్చారని బాబు కితాబునిచ్చారు. విశాఖపట్టణం కేవలం భారత్ లోనే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పర్యాటక ప్రాంతమని ఆయన చెప్పారు. బీచ్ సిటీగా విశాఖపట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. విశాఖలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పారు. అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా దీనిని మరింత అభివృద్ధి చేయాలని ఆయన తెలిపారు.