: 15 గంటల సుదీర్ఘ కాల్పులతో ముగిసిన పఠాన్ కోట్ ఎన్ కౌంటర్


పంజాబ్ లోని పఠాన్ కోట్ లో గల భారత కీలక ఎయిర్ ఫోర్స్ బేస్ పై మెరుపు దాడికి తెగబడిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. సుమారు 15 గంటల పాటు సాగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టారు. నేటి తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చి, రెండు వాహనాలలోని వ్యక్తులను హతమార్చి, ఆ వాహనాలను అపహరించిన ఉగ్రవాదులు ఎయిర్ బేస్ పై విరుచుకుపడ్డారు. మిగ్, ఫైటర్ విమానాల అపహరణే లక్ష్యంగా దాడికి దిగిన ఉగ్రవాదులను ఎయిర్ ఫోర్స్ భద్రతా సిబ్బంది నిలువరించారు. వస్తూనే కాల్పులతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు ఈ ఆపరేషన్ లో పాలుపంచుకున్నట్టు తెలుస్తోంది. పఠాన్ కోట్ పరిసరాల్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. దీంతో పఠాన్ కోట్ పరిసరాల్లో ముమ్మర తనిఖీలు జరుపుతున్నారు. పరిసర ప్రాంతాల్లో హెలీకాప్టర్లపై పహారా కాస్తున్నారు. ఆపరేషన్ లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), గరుడ కమాండో ఫోర్స్ సిబ్బంది పాలుపంచుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వీరమరణం పొందారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News