: నూతన సంవత్సరం రోజే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైన సెల్ఫీ
వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ ఆత్మీయులతో కలసి ఉల్లాసంగా గడపడం, ఆ సందర్భంగా సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో పెట్టి, దానికి వచ్చే లైకులు, కామెంట్లు, షేర్లను చూసుకోవడం ఇటీవల చాలామందికి దినచర్యగా మారింది. నూతన సంవత్సరం రోజున కూడా ఓ జంట ఇలాగే దిగిన ఓ సెల్ఫీ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దుబాయ్ లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు ఓ జంట వెళ్లారు. ఓ హోటల్ లో వారు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఇదే సమయంలో దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫ్ సమీపంలో ఓ హోటల్ లో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదం వీరికి దగ్గరలోనే జరగడంతో, ఆ బ్యాక్ గ్రౌండ్ వచ్చే విధంగా వారు సెల్ఫీ తీసుకుని దానిని సోషల్ మీడియాలో పెట్టారు. వీరు పెట్టిన కాసేపటికే అది వైరల్ గా మారింది. ఆ వెంటనే అది విమర్శలపాలైంది. దగ్గర్లోనే దారుణం జరుగుతుంటే ఆపన్న హస్తం అందించడానికి వెళ్లడం మానేసి, దాని దగ్గర సెల్పీ తీసుకోవడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది ఆ జంట విలువలపై పెద్ద చర్చే చేస్తున్నారు. గతంలో శవాన్ని మోస్తూ ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టి పెను వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే.