: నితీశ్ కంటే ఆయన కొడుకు ఆస్తే ఎక్కువట... లాలూ కొడుకుల ఆస్తుల ముందూ నితీశ్ తీసికట్టే!


బీహార్ లో గూండారాజ్ పాలనకు చెల్లుచీటి ఇచ్చేసిన విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు సాటి రాగల వారెవ్వరూ లేరు. ఇప్పటిదాకా ఆ రాష్ట్రాన్ని ఏలిన సీఎంలు అంతా గూండారాజ్ ను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పెంచి పోషించిన వారేనన్న వాదనా లేకపోలేదు. అయితే వారందరికి భిన్నంగా అడుగులేసిన నితీశ్ కుమార్, తొలిసారి అధికారం చేపట్టిన వెంటనే గూండారాజ్ పై కత్తి దూశారు. పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించి తుపాకీ రాజ్యానికి స్వస్తి చెప్పారు. అంతకుముందు పనిచేసిన సీఎంలు అందరూ ఆస్తులు కూడబెట్టుకుంటే, నితీశ్ మాత్రం మిస్టర్ క్లీన్ అనే బిరుదు మాత్రం అందుకున్నారు. ఇక ఆస్తుల విషయానికి వస్తే.... నితీశ్ కుమార్ ఆస్తుల విలువ కేవలం 59.3 లక్షలేనట. అదే ఆయన పుత్రరత్నం నిశాంత్ కుమార్ పేరిట రూ.2.14 కోట్ల ఆస్తులున్నాయట. అంటే సీఎంగా ఉన్న తన తండ్రి కంటే కూడా నిశాంత్ కుమార్ మూడు రెట్ల మేర అధికంగా ఆస్తులు కలిగి ఉన్నాడు. ఇక నితీశ్ కుమార్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ కు రూ.1.12 కోట్లు ఉన్నాయి. అంటే, సీఎం కంటే డిప్యూటీ సీఎం ఆస్తుల విలువ రెట్టింపన్నమాట. సీఎం కంటే రెట్టింపు ఆస్తులున్న డిప్యూటీ సీఎంకు మాత్రం సొంత కారు లేదట. ఇక లాలూ పెద్ద కొడుకు, బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కు రూ.1.5 కోట్ల ఆస్తులున్నాయట. తేజస్వీకి సింగిల్ కారు లేకున్నా, తేజ్ ప్రతాప్ కు మాత్రం రూ.30 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారు, రూ.15.4 లక్షల విలువ చేసే బైకు ఉన్నాయట.

  • Loading...

More Telugu News