: దాడికి తెగబడ్డ ఆరుగురిలో నలుగురు హతం... ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది
పంజాబ్ లోని భారత కీలక స్థావరం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై మెరుపు దాడికి తెగబడిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుగా తెలుస్తోంది. నేటి తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో విరుచుకుపడ్డ ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది నిలువరించారు. దీంతో కాల్పులు ప్రారంభించిన ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. తాజా సమాచారం మేరకు మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్లో నలుగురు హతమైనట్లు తెలుస్తోంది. ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి. పరిస్థితిని అంచనా వేసిన ఉన్నతాధికారులు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), గరుడ కమాండో ఫోర్స్ ను రంగంలోకి దించారు. ఇదిలా ఉంటే, ఉగ్రవాదుల మెరుపు దాడిలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా చనిపోయారు.