: టాలీవుడ్ స్టార్ల బాటలో కేటీఆర్!... చిన్నారి 'అభిలాష'ను తీర్చేందుకు నిమ్స్ కు వెళ్లిన తెలంగాణ మంత్రి
ఆమధ్య తనను చూడాలని కోరుకున్న చిన్నారి కోరికను తీర్చేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హైదరాబాదు నుంచి ఖమ్మం వెళ్లారు. పవన్ స్పర్శతో మృత్యువు ముంగిటకు వెళ్లిన చిన్నారి బాలిక ప్రాణం పోసుకుంది. అనతి కాలంలోనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆ బాలిక కోలుకుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆ బాలిక పవన్ కల్యాణ్ ను ఆయన ఇంటిలో కలుసుకుంది. ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తన చిన్నారి అభిమానిని ఆసుపత్రికి వెళ్లి కలిశాడు. బొమ్మలు అందించి త్వరగా కోలుకోవాలని చెప్పి వచ్చాడు. తాజాగా తనను కలవాలని ఉందన్న సరస్వతి పుత్రుడిని టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న ఆసుపత్రికి వెళ్లి మరీ కలిశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన కృష్ణార్జున్ రావు, జ్యోతి దంపతుల కుమారుడు సంతోష్... చదువులో మెరుగ్గా రాణించాడు. సర్కారీ విద్యాలయంలో పదో తరగతి చదివిన అతడు 9.5 స్కోరుతో పాసయ్యాడు. అయితే కపుడులో తీవ్ర నొప్పి అతడిని ఆసుపత్రి పాల్జేసింది. తొలుత ఖమ్మం, ఆ తర్వాత హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స, ఆపరేషన్ అనంతరం నిమ్స్ ఆసుపత్రికి మారాడు. తనకు ఉన్నత చదువులు చదుకోవాలని ఉందని, కేటీఆర్ ను కలుసుకోవాలని ఉందని తన తల్లిదండ్రులకు చెప్పాడు. కొడుకు అభిలాషను తీర్చాలని నిర్ణయించుకున్న వారు ఈ విషయాన్ని ‘మేక్ ఏ విష్’ ఫౌండేషన్ ప్రతినిధులకు చేరవేశారు. ఫౌండేషన్ ద్వారా సమాచారం అందుకున్న కేటీఆర్ నిన్న నేరుగా నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని వెంటబెట్టుకుని ఆసుపత్రికి వచ్చిన కేటీఆర్... సంతోష్ లో కొత్త ఆశలను రేకెత్తించారు. ఆరోగ్యం కుదుటపడి తీరుతుందని సంతోష్ కు ధైర్యం చెప్పిన కేటీఆర్, ఉన్నత చదువులు కూడా చెప్పిస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ తన వద్దకు వచ్చి పలకరించడమే కాక ఉన్నత విద్యకు భరోసా ఇవ్వడంతో సంతోష్ లో కొత్త ఆశలు చిగురించాయి.