: రంగంలోకి జాతీయ భద్రతా సలహాదారు ... ‘ఉగ్ర’దాడిపై ఉన్నతాధికారులతో దోవల్ భేటీ
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల మెరుపు దాడితో నేటి ఉదయం తెల్లవారకముందే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగిపోయారు, ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ లో ఆయన ఉన్నతాధికారులతో అత్యసవసరంగా భేటీ అయ్యారు. ఉగ్రవాదుల దాడి, అనంతర పరిణామాలపై ఆరా తీసిన దోవల్ పెద్ద ఎత్తున బలగాలను పఠాన్ కోట్ లో మోహరించారు. రెండు రోజులుగా వరుసగా చోటుచేసుకున్న ఘటనలపై పూర్తి వివరాలు సేకరిస్తున్న దోవల్, ఉగ్రవాదుల పన్నాగాలను వెలికితీసే పనిలో పడ్డారు. అంతేకాక పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో మరిన్ని దాడులు చోటుచేసుకోకుండా ఉండేలా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. దోవల్ ఆదేశాలతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా పోలీసులు భద్రతను పెంచారు. విమానాశ్రయానికి వస్తున్న వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత కాని లోపలికి అనుమతించడం లేదు. మరిన్ని కీలక ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.