: శ్రీనగర్ లో ఐఎస్, పాక్ జెండాలు... హఫీజ్ సయీద్ కు అనుకూలంగా నినాదాలు, ఉద్రిక్తత
జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. శుక్రవారం వస్తే చాలు, శత్రు దేశం పాకిస్థాన్ జెండాలను చేతబట్టి వీధుల్లోకి వస్తున్న వేర్పాటువాదులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. నిన్న పాక్ జెండాలతో పాటు కొత్తగా ప్రపంచ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కు చెందిన జెండాలను కూడా కాశ్మీర్ యువత చేతబట్టింది. శ్రీనగర్ నడిబొడ్డున సదరు యువత ఆ జెండాలు చేతబట్టి రోడ్డెక్కడమే కాకుండా పాక్ భూభాగం కేంద్రంగా నిత్యం భారత్ పై దాడులకు పథకం పన్నుతున్న ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్ కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. శాంతి భదత్రల పరిరక్షణ కోసం రంగంలోకి దిగిన పోలీసులను వేర్పాటువాదులు కవ్వించారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో పాటు స్వల్ప మోతాదులో లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. పట్టపగలు ఏకంగా కాశ్మీర్ రాజధానిగా ఉన్న నగరంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. యువకుల పాక్ అనుకూల నినాదాలు, పోలీసుల బాష్పవాయు గోళాల ప్రయోగంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.