: ఈ ఏడాది ఐపీఎల్ లో కోహ్లీ ఆదాయమే టాప్
ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. బీసీసీఐకి కాసుల పంట పండించిన ఐపీఎల్ లో ఆడిన క్రికెటర్లు ధనవంతులుగా మారుతారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే పలు దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడేందుకు ఆసక్తి చూపుతారు. ఐపీఎల్ ఎడిషన్ తొలి నాళ్లలో సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్, గంభీర్, ధోనీ, యువరాజ్ వంటి వారు అధిక ఆదాయం పొందే ఆటగాళ్లుగా పేరు సంపాదించుకున్నారు. తరువాత ధోనీ అత్యధిక ఆదాయం పొందే ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించడంతో ధోనీని పూణే జట్టు కొనుక్కుంది. దీంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున 15 కోట్ల రూపాయలతో కోహ్లీ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆటగాడిగా నిలిచాడు. అతని తరువాత స్థానాన్ని 12.5 కోట్ల రూపాయలు తీసుకుంటున్న ధోనీ (పూణే), శిఖర్ ధావన్ లు సొంతం చేసుకున్నారు. తరువాతి స్థానంలో 11.5 కోట్లతో రోహిత్ నిలవగా, 10 కోట్లు తీసుకుంటున్న గంభీర్ నాలుగో స్థానంలో నిలిచాడు. తరువాతి స్థానాల్లో రైనా, డివిలియర్స్ (9.5 కోట్లు), గేల్ (8.4 కోట్లు), రహానే, హర్భజన్ (8 కోట్లు), 7.5 కోట్లతో అశ్విన్, 5.5 కోట్లతో జడేజా నిలిచారు.