: ఢిల్లీలో ఈరోజు కాలుష్యం తగ్గకపోయినా ట్రాఫిక్ సమస్య తగ్గిందట!


ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సరి-బేసి సంఖ్యల విధానం విజయం సాధించిందా? విఫలమైందా? అనే విశ్లేషణలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే తొలి రోజే ఈ చర్చ చేపట్టడంపై 'అన్నప్రాసన నాడే ఆవకాయతో భోజనం' అంటే ఎలా? అంటూ అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తొలి రోజు కేవలం బేసి సంఖ్యల వాహనాలే రోడ్లెక్కగా, నేటి ఈ ప్రయోగంతో వాతావరణ కాలుష్యంలో ఎలాంటి మార్పు రాలేదని అధికారులు వెల్లడించారు. అదే సమయంలో మరో సమస్యకు పరిష్కారం లభించిందని వారు వివరించారు. వాతావరణంలో మార్పులు సంభవించకపోవడానికి పలు కారణాలు వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలు కూడా కాలుష్యంపై ప్రభావం చూపాయి. అదే సమయంలో ఢిల్లీలో చలి, పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉండడంతో పట్టణం ఉపరితలంపై గాలి సంచారం లేక కాలుష్యం పట్టణం మీదే ఉండిపోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీలో కాలుష్యం తగ్గాలంటే సరి-బేసి సంఖ్యల విధానంతో పాటు వాతావరణం కూడ సహకరించాలని వారు వివరించారు. అదే సమయంలో ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమయ్యాయని పోలీసులు తెలిపారు. సగం వాహనాలు ఇళ్లకే పరిమితం కావడంతో ట్రాఫిక్ లో ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోలేదని వారు వివరించారు. అలాగే నగర వాసులు పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఉపయోగించుకునేందుకు ప్రయత్నించగా, మరి కొందరు కార్ పూలింగ్ యాప్స్ వైపు మొగ్గు చూపారు. తాజా విధానంతో కాలుష్య సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నించగా, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరికింది.

  • Loading...

More Telugu News