: విమానాశ్రయంలో బాంబు ఉందంటూ ప్రయాణికుడి బెదిరింపు!
తన వద్ద బాంబు ఉందంటూ విమానాశ్రయంలోని ఒక వ్యక్తి బెదిరించిన సంఘటన ఆమ్ స్టర్ డామ్ లోని స్చిపోల్ ఎయిర్ పోర్టులో ఈరోజు జరిగింది. బ్రిటన్ కు చెందిన 29 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లుండి తన వద్ద బాంబు ఉందంటూ గట్టిగా అరిచాడు. దీంతో అప్రమత్తమైన భద్రతాధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. స్నిఫర్ డాగ్ లను రంగంలోకి దింపారు. బాంబు బెదిరింపునకు పాల్పడిన వ్యక్తి లగేజ్ ను చెక్ చేశారు. అయితే, అతని వద్ద ఎటువంటి బాంబులు లేవని భద్రతాధికారులు గుర్తించారు. ఎటువంటి ప్రమాదం లేదని తేల్చుకున్న తర్వాతనే ప్రయాణికులను ఎయిర్ పోర్ట్ లోకి అనుమతించారు. ఈ సంఘటనపై భద్రతాధికారులు విచారణ జరుపుతున్నారు.