: సొంత పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వనున్న అళగిరి!... కొడుకు రాకకు సమ్మతించిన కరుణ


డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి తిరిగి పార్టీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు ఆయన రీఎంట్రీ ఖరారైంది. ఇందుకు కరుణ కూడా అంగీకరించినట్టు తెలిసింది. పార్టీలో లోటుపాట్లను సరిదిద్దేందుకు, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో దృఢపరిచేందుకు పూనుకున్న కరుణ... ఈ మేరకు అళగిరిని పార్టీలోకి తీసుకునేందుకు సమ్మతించారు. అది కూడా కుటుంబీకుల ఒత్తిడి, కొంతమంది పార్టీ నేతల వినతి మేరకే పెద్ద కుమారుడి రాకను అంగీకరించినట్టు సమాచారం. కానీ ఆయన రెండో కుమారుడు స్టాలిన్ మాత్రం ఈ విషయంలో అయిష్టంగానే ఉన్నాడని అంటున్నారు. ఏదేమైనా ఈ నెల చివరిలోగా అళగిరి తిరిగి డీఎంకేలో చేరతారని విశ్వసనీయ సమాచారం. తన వారసుడు స్టాలిన్ అంటూ గతంలో కరుణానిధి చేసిన ప్రకటనతో అళగిరి సహా ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దాంతో తండ్రి ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించి పార్టీ కార్యక్రమాలు, కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2013 చివరిలో అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన, ఏ పార్టీలోనూ చేరలేదు. ఆ తరువాత ఓ రోజు... డీఎంకేను వీడి తాను ఏ పార్టీలోను చేరలేనని, కష్టమైనా, నష్టమైనా ఆ పార్టీతోనే ఉంటానని అళగిరి ప్రకటించారు. దాంతో ఎప్పటికైనా తండ్రి గూటికే చేరతారని స్పష్టమైంది.

  • Loading...

More Telugu News