: ఆదుకోకుంటే రైల్వేలు కుదేలు: సురేశ్ ప్రభు
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థను నిర్వహిస్తున్న భారతీయ రైల్వేలు నిధుల కొరతతో నష్టాల్లోకి వెళ్లకముందే ఆర్థిక మంత్రిత్వ శాఖ కల్పించుకోవాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు కోరుతున్నారు. ఈ మేరకు అరుణ్ జైట్లీకి లేఖ రాసిన సురేశ్ ప్రభు, 7వ వేతన సంఘ సిఫార్సుల అమలు కారణంగా రూ. 32 వేల కోట్ల భారం పడనుందని, దాన్ని ఆర్థిక శాఖ భరించాలని ఆయన కోరారు. 7వ సీపీసీ సిఫార్సుల అమలుకు సహకరించాలని తాను మనస్ఫూర్తిగా ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేస్తున్నట్టు సురేశ్ ప్రభు, ఆ లేఖలో రాశారు. ఈ నిధులను ప్రత్యక్షంగా ఇచ్చినా, పరోక్షంగా ఇచ్చినా సరేనని, రైల్వేలు నష్టాల్లోకి వెళ్లకుండా చూస్తే చాలునని అన్నారు. ఈ నిధులతో వచ్చే మూడు, నాలుగేళ్లలో ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. పరిస్థితులను సమీక్షించిన మీదటే సరకు రవాణా చార్జీలను పెంచాల్సి వచ్చిందని అన్నారు. కాగా, పే కమిషన్ సిఫార్సులను అమలు చేస్తే రైల్వేలపై రూ. 28,450 కోట్ల భారం పడుతుంది. దీన్ని 2016-17 రైల్వే బడ్జెట్ లో పొందుపరచాల్సి వుండగా, దీనిలో దాదాపు రూ. 15 వేల కోట్లకు పైగా లోటు చూపాల్సి రావచ్చని అంచనా.