: ఉలుకూ పలుకు లేని వాట్స్ యాప్!
మెసేజింగ్ దిగ్గజం వాట్స్ యాప్ ద్వారా నూతన సంవత్సరపు శుభవేళ బంధుమిత్రులకు చెబుదామనుకున్న నెటిజన్లకు, స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు నిరాశ ఎదురైంది. ఒక్కసారిగా ట్రాఫిక్ పెరగడంతో కొన్ని గంటలపాటు వాట్స్ యాప్ సేవలు ఆగిపోయాయి. "ఈ ఉదయం వాట్స్ యాప్ ఓపెన్ కావడం లేదని కొందరు ఫిర్యాదు చేశారు. ఆపై సమస్యను పరిష్కరించాం. ఊహించని విధంగా కోట్లాదిమంది ఒకే సమయంలో యాప్ ఓపెన్ చేయడంతోనే ఇలా జరిగింది. అసౌకర్యానికి చింతిస్తున్నాం. కొద్దిగా డేటా బట్వాడా ఆలస్యమవుతున్నా, ప్రస్తుతం యాప్ ఓపెన్ అవుతోంది" అని వాట్స్ యాప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇండియాలో గత రాత్రి 10 గంటల నుంచి యాప్ సేవలు ఆగిపోయాయి. ఆపై ఈ ఉదయం పరిమిత సంఖ్యలో యాప్ ను యాక్సెస్ చేసుకోగలిగారు. ఇంకా పూర్తి స్థాయిలో సేవలను పునరుద్ధరించాల్సి వుంది.