: దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు... మరికాసేపట్లో ‘పశ్చిమ’ పర్యటన
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొత్త ఏడాదిని శుభసూచకంతో ప్రారంభించారు. విజయవాడలో కొద్దిసేపటి క్రితం తన నివాసం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నేరుగా ఇందకీలాద్రికి చేరుకుని కనకదుర్గామాతను దర్శించుకున్నారు. నిన్న రాత్రి పొద్దుపోయే దాకా పాలనా వ్యవహారాల్లో నిమగ్నమైన ఆయన నేటి ఉదయమే దుర్గమ్మను దర్శించుకుని తన కార్యకలాపాలను ప్రారంభించారు. నేటి షెడ్యూల్ లో భాగంగా చంద్రబాబు మరికాసేపట్లో పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. మాతా శిశు సంరక్షణకు ఉద్దేశించిన పథకాన్ని ప్రారంభించనున్న ఆయన అక్కడే నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.